Saturday, June 1, 2019

తెలుగు పద్యరచలో ఆంగ్ల పదాల వాడుక

ఈ ప్రస్తావన తరచు వస్తూ ఉంటుంది కాబట్టి నా అభిప్రాయాన్ని కూడా జతకలుపుతాను.

ఛందస్సులో ఆంగ్లమూ తెలుగు కన్నడ అన్నీ వాడవచ్చును కాని అందులో ఒక గొడవుంది. ఆంగ్లంలో Apple ని 'ఆపిల్' అని  తెలుగు లో వ్రాయవచ్చు. Problem ని 'ప్రాబ్లం' అని  'ప్రాబ్లెం' అని, 'ప్రోబ్లెం' అని,  'ప్రొబ్లం' అని వ్రావయచ్చు. వీటిని మనం మన 'మేధస్సుతో' Problem అని అన్వయించుకుంటాము.

ఒక శార్ధూల పద్యవాక్యాన్ని ఉదాహరణగా తీసుకుందాం:
శా||
ప్రస్థావించెడి పద్యగద్యములయన్ ప్రాబ్లమ్ను చూడంగదే!

ఇక్కడ 'ప్రా యతి కుదర్చడానికి 'ప్రాబ్లం' అని వ్రాసాను.

మరి యతి ప్రొ పదానికి రావాలంటే? ప్రోబ్లెం అని వ్రాసుకుంటాను హాయిగా..

శా||
ప్రోత్సాహంబును ఛాందసంబునకిడన్ 'ప్రోబ్లం'బయెన్ నేడిలన్

నాకు కావల్సినపుడు యతి కుదుర్చుకునేందుకు ప్రాబ్లం అని లేక ప్రోబ్లం అని వ్రాసుకున్నాను/రాసుకున్నాను. అది నా భావనలో రసవత్కరం కాజాలదు. గణాలు సరిపొవడానికి మన ఇస్టానుసారంగా వ్రాసే స్వేచ్చ ఇస్తుంది పరభాష. దీనివల్ల మనం, పట్టేచోట గణాలు గుచ్చేసి, పద్యం ఐపొయింది అంటుంటాం.

కవిత్వానికి గద్యానికి తేడా 'ప్రవాహం' తెలుపుతుందని నేను నమ్ముతాను. గద్యంలోనూ పద్యంలోనూ రసాన్ని తెలియజేయవచ్చు. గద్యంలో కూడ ప్రవాహాన్ని జేరిస్తే అది కవిత్వం ఐపోతుంది, గద్యకవిత్వం. ఫద్యకవిత్వానికీ గద్యకవిత్వానికి తేడా.. ఛందస్సు.

మనం సులభంగా తెలుగు లో ఇంగ్లీషు పదాలని అనుమతించినట్టూ ఇంగ్లీషే ఇంగ్లీషు పదాలని  అనుమతించదు. ఒక మాటకి వేరొక స్పెల్లింగు పెట్టనివ్వదు.
'Problem' ని 'Prablem' అని వ్రాస్తే ఇంగ్లిషు ఊరుకుంటుందా? సాంస్కృతిక భాషలలో శబ్దం ప్రధానం. శబ్దమెలా ఉందో అక్షరం కూడా అలాగే ఉంటుంది. పాశ్చాత్య భాషలలో శబ్దమొకటి వ్రాసే స్పెల్లింగు ఒకటి ఉంటుంది. వారికి అది ప్రధానం కాదు.

ఇప్పుడు తెలుగు కవిత్వంలో ఆంగ్లం చేర్చవచ్చునా? తప్పక చేర్చవచ్చును. శ్రీనాధుడు 'దీనారటంకాల తీర్ధమాడించితి' అన్నాడు. దీనారము పారసీకము. Dinar కి వేరు పేరు లేదు. Apple పండుకి వేరు పేరు లేదు. 'యాపిల్' అనియే వ్రాయాలి.

Problem కి వేరు పేరు తెలుగు లో ఉందా? ఉంది. ఉన్నాయి, బోలెడన్ని పర్యాయాలు. కష్టము అని మొదలుగా వ్రాయగలిగియుండియూ 'ప్రెబ్లెం' అనో, 'ప్రాబ్లం' అనో వ్రాస్తే అది ప్రశంసనీయము కాజాలదు. అది గణాలు సమకూర్చుటకు తెలుగు భాష లో ఉన్నపదాలు ఉపయోగించుకోలేక చేసిన ప్రయోగమని అనిపిస్తుంది.

కానీ ఆఖరిగా అన్నిటికంటే కవిత్వంలో ముఖ్యపదార్ధం రసము.
ఒక్క రసమైనా ప్రజ్వలించాలి. Sentence formation 'సరిగ్గ' లేక తెలుగు పదాలు వాడక, గణాలు మాత్రము సరిపోతే అది కవిత్వము కాదు.